ఉద్దేశ్యం

ఈ బ్లాగు యొక్క ఉద్దేశ్యం విషవృక్షం పుస్తకాన్ని సమీక్షించి ఆ పుస్తకం రచయిత్రి రామాయణం గురించి చేసిన కువిమర్శలు/విషప్రచారాలను బయట పెట్టడం. ఇందులో రచయిత్రి వ్యక్తిగత విషయాలు గానీ, అసభ్య పదజాలం గాని ఉండదు. ఒక వేళ ఎవరి వ్యక్తిగత విషయాలైనా చర్చకువస్తే అది ఏదో ఒక విషయాన్ని స్పష్టం చేయడానికే తప్ప అవమానించడానికి మాత్రం కాదు. గమనించగలరు!

Wednesday 8 August 2012

రాసేది రంగనాయకమ్మ అయితే చిడతలు వాయించేది చవటాయిలని ..

రంగనాయకమ్మ చెంచాలు విషవృక్షం గురించి ముఖ్యంగా చెప్పేది విషవృక్షంలో లాజిక్ చూడమని. అది కూడా చూద్దాం!

మన సోకాల్డ్ మహారచయిత్రి మాటల్లోనే క్రింది విషయంతో మొదలుపెడదాం.

1. "ఎందుకంటే దశరధుడు కైకని పెళ్ళి చేసుకునేటప్పుడు కైక బిడ్డకే రాజ్యం ఇస్తానని వాగ్దానం చేసి ఉన్నాడు"

2. "రాముడు అడవుల్లో ఉన్నప్పుడు.. అప్పుడు బయటపడింది ఆ విషయం"

3. "ఆ విషయం తెలిసికూడా రాముడు పట్టాభిషేకానికి సిద్ధపడ్డాడంటే అది రాముడి కపటత్వం అవ్వదూ?"


రామాయణంలోకి వస్తే ఆయోధ్యకాండ నాలుగవ సర్గ పదిహేనవ శ్లోకంలో దశరధుడు రాముడికి పట్టాభిషేకం విషయం చెప్తాడు. అదే సర్గలో రాముడు పట్టాభిషేకానికి సిద్ధమవుతాడు. మంథర పాత్ర ఏడవ సర్గ నుండీ మొదలవుతుంది. అంటే పట్టాభిషేకానికి సిద్ధపడేసమయానికి రాముడికి దశరధుడివరాల సంగతి తెలియదనే కదా? రంనాయకమ్మ లాంటి మార్క్సిస్టులకి ఆపాటి కనీస జ్ఞానం ఉంటే ఇంకేం?

ఇక అడవుల్లో రాముడు భరతుడితో అన్న మాటలివీ:

(అయోధ్యకాండ నూట ఏడవ సర్గ నుండి)

పురా భ్రాత: పితా న: స మాతరం తె సముద్వహన్
మాతామహె సమాష్రౌశీద్ రాజ్య శుల్కం అనుత్తమం


భ్రాత:= ఓ సోదరా!
పురా= పూర్వము (చాలా రోజుల క్రితం)
సముద్వహన్= పెండ్లాడేటప్పుడు;
తె మాతరం= నీ తల్లికి;
స:= అని
న: పితా= మన తండ్రి
సమాష్రౌశీత్= ప్రమాణము చేసెను
అనుత్తమం= ప్రత్యేకమయిన
రాజ్యషుల్కం= రాజ్యశుల్కం;
మాతామహె= మీ తాతగారికి

అంటే...

"ఓ సోదరా, మన తండ్రి నీ తల్లిని పెండ్లాడేటప్పుడు మీ తాతగారికి రాజ్యశుల్కమిస్తానని ఒప్పుకున్నారు"

ఇచ్చేది ఎవరికి? కైకేయి తండ్రికి.
కైకేయి తండ్రి దానిని తీసుకున్నాడా? లేదు.
అంటే అది కైకేయి తండ్రి తీసుకునేవరకూ దశరధుడి వంశానికే చెదుతుంది. ఒకవేళ తీసుకుని ఉంటే కైకేయి సోదరుడికి చెందుతుంది తప్ప, భరతుడికి చెందదు.

దాని తరువాత రాముడు భరతుడికి దశరధుడి వరాల సంగతి చెప్తాడు.. దాని గురించి కూడా పైనే చెప్పుకున్నాం. కనుక ఇక్కడ భరతుడి హక్కు, అది రాముడికి తెలియడం అనే ప్రసక్తి రానే రాదు.

కానీ రాసేది రంగనాయకమ్మ అయితే చిడతలు వాయించేది ఆవిడ చెంచాలే కదా!

ఇక వాల్మీకి రాముడి భజన గురించి. ఒక మూల కవి ఇలా ఎందుకు రాయలేదు, అలా ఎందుకు రాశాడు అని సన్నాయి నొక్కులు నొక్కుతూనే రామయణం అనేది వాల్మీకికంటే ముందునుండే ఉందన్న వాదన ఒకటి.

పనిమనిషికి కడుపు చేసి శిష్యుడి మీద వదిలేసిన మార్క్స్ గారికి మరి ఈవిడ చేసేదేమిటో? భజన కాదూ? చెంచాగిరీ కాదూ?


సర్వేజనా సుఖినోభవంతు
-రామదండు

Wednesday 20 June 2012

రంగనాయకమ్మ పైశాచిక ఆనందం..

కొన్ని నవ్వించే విషయాలు అనే శీర్షిక క్రింద రంగనాయకమ్మ రాసిన విషయాలు చూద్దాం..


దశరథుడు కైక కోరిన వరాలకు అదిరిపడి "భర్త ముద్దుగా వరాలు కోరుకోమంటే మాత్రం చక్కగా భర్తకు సంతోషం కలిగించే వరాలు కోరుకోవాలి గానీ భర్తకు నష్టం కలిగించే వరాలు కోరుకోవచ్చునా?" అని విసుక్కున్నాడు. చక్కగా భార్యలు చీరలో, నగలో కోరుకుంటే దశరథ మహారాజు గారు వాటిని తక్షణం తెప్పించి ఇచ్చి తమ కీర్తికాంతులు నలుదిశలా వెదజల్లేవారే, అంత కీర్తి తప్పిపోయినందుకు మహరాజు భార్య మీద మండిపడ్డాడు "దుష్టురాలా! నీ వరాల్ల నేను రాముణ్ణి అడవికి పంపితే ఆ దు:ఖంతో నేను చచ్చిపోతాను. నా కోసం రాముడు చచ్చిపోతాడు, లక్ష్మణుడు చచ్చిపోతాడు. భరతుడు చచ్చిపోతాడు. శతృఘ్నుడు చచ్చిపోతాడు రాణులందరూ చచ్చిపోతారు" అంటూ తనతోపాటూ చచ్చిపోయే వాళ్ళ పట్టీ చదువుతాడు. కానీ తమాషా ఏమంటే దశరథుడు చచ్చిపొయిన తర్వాత ఒక్కరన్నా చచ్చిపోలేదు. పైగా అయోధ్యలో సందడి ఇంకా ఎక్కువ అయ్యింది. "ముసలి రాజు పోయాడు పెద్ద కొడుకు అడవుల్లో ఉన్నాడు. భరతుడింకా రాలేదు. ఇప్పుడేం జరుగుతుందో" అనే ఉత్సాహంతో జనం ఎక్కడికక్కడ కబుర్లలో మునిగి ఉన్నారు.
తమపిల్లలు తమని ప్రేమిస్తారని ప్రతీ తండ్రీ అనుకుంటాడు. దశరథ మహారాజు కూడా అలానే అనుకున్నాడు.  అందుకు ఆయన మీద జోకులు!! ఏం చేస్తాం మన ప్రారబ్దం!! పైన వాక్యం లో కవి దశరథుడికి తన కుమారులతో  ఉన్న అనుబంధాన్ని వివరించడం సుస్పష్టం. దానిలోని ఒక వాక్యాన్ని బయటకు తీసి రంగనాయకమ్మ తమాషా అనడం అమె పైశాచిక ప్రవృత్తికి నిదర్శనం. తండ్రిలేని జీవితం మనిషికి అంధకారం లాంటిదని పెద్దలు చెబుతారు. అంటే దాని అర్థం ప్రపంచంలోని తండ్రులందరూ తలపైన దీపాలు పెట్టుకుని తిరుగుతున్నారని కాదు.  ఇక జనం ఉత్సాహంతో ఎక్కడికక్కడ కబుర్లలో మునిగి ఉన్నారు అని చెప్పడం సత్యదూరం. భరతుడు రాజ్యంలోకి వచ్చేదారిలో దు:ఖమయమైన నగరాన్ని చూసి ఆందోళన చెందాడని వాల్మీకి మహర్షి రాశారు. తనకు అనుకూలంగా లేదని కాబోలు రంగనాయకమ్మ ఆ ఊసే ఎత్తలేదు. అనుబంధాలని పరిహసించే రంగనాయకమ్మ స్త్రీల గురించి అమ్మల గురించి పుంఖానుపుంఖాలుగా రాయడం తెలుగు జాతికి పట్టిన దౌర్భాగ్యం. 


మరొకటి..
తనను, సారథిని, గుఱ్ఱాలనూ రక్షిస్తూ 11వేలమంది శతృవీరుల్తో వొక్కసారిగా యుద్ధంచేసి జయిస్తాడని రుషులు రాముడిని పొగుడుతారు. అలాంటి రాముడు గంగదాటి అడవిలోకాలు మోపగానే "లక్ష్మణా! నువ్వు రాకపోతే సీతని రక్షించడం చాలా కష్టమైపొయేది. మీరిద్దరూ ముందు నడవండి. నేను వెనుక నడుస్తాను. మిమ్మల్ని వెనుక నుంచీ రక్షిస్తాను" అంటాడు. అడవుల్లో రక్షించవలసినవాళ్ళు వెనుక నడవాలా, ముందు నడవాలా?? 
అడవిలో ముందు నుంచీ మాత్రమే ప్రమాదాలొస్తాయనే రంగనాయకమ్మ తెలివికి లాల్ సలాం! అసలు ఇలాంటి తింగర లాజిక్కులు ఇంకెవరూ చెప్పలేరేమో.. ఒకసారి రంగనాయకమ్మ చేత ఏ తలకోన అడవిలోనో పాదయాత్ర చేయిస్తే అప్పుడు తెలుస్తుంది ప్రమాదాలు ఏ వైపు నుంచీ వస్తాయో. ముందు టపాలో చెప్పినట్టు ఎలాగైన రాముణ్ణి కించపరచాలనే ఆకాంక్ష రంగనాయకమ్మలో బలంగా ఉంది. అందుకే ఇంత నిర్లజ్జగా నిస్సిగ్గుగా అర్థం పర్థం లేని వాదనలు చేయగలిగింది.


ఇంకొకటి..
రాముడు, సీతా, లక్ష్మణుడూ వనవాసంలో అత్రి మహాముని ఆశ్రమానికి వెళతారు. అత్రి భార్య అనసూయ మహ పతీవ్రత. వృద్ధురాలు. నెరసిన జుట్టు వొణికే శరీరం. ఆమె సీతకు పూలదండా, అంగరాగాలు ఇస్తుంది. "నా దగ్గర తపస్సు చాలా మిగిలి ఉంది. నా తపోశక్తితో నీకి బహుమానాలిస్తున్నాను. నిత్యం ఈ పూలదండ ధరిస్తే నువ్వు నిత్య యవ్వనవతిగా ఉంటావు. ఈ అంగరాగాలతో నీ సౌందర్యం ఇనుమడిస్తుంది. ఇవి ధరిస్తే యవ్వనంతో నీ భర్తకి సంతోషం కలిగిస్తావు" అంటుంది. మరి తన మాట??తనెందుకు వాటిని ధరించి నిత్యయవ్వనవతిగా ఉండలేదు?అత్రి మహాముని గారికి ఆ ముగ్గుబుట్ట తలే ఇష్టం కావున్ను!!
తన తపోశక్తితో అనసూయ సీతకు బహుమతి ఇస్తే మధ్య రంగనాయకమ్మకు బాధ ఎందుకో?? అలాంటి బహుమతులు తనకు ఎవరూ ఇవ్వలేదనా?? లేక ఎలాగైన విమర్శించాలనే తపనా? మరొక విషయం- మనశక్తిని వేరేవాళ్ళకోసం ఉపయోగించడం మనకు వాళ్ళ మీద ఉన్న అనురాగాన్ని ఆప్యాయతని చెబుతుంది. ప్రతీ ఒక్కటి తనకు మాత్రమే కావాలనుకునే స్వార్థపు ఆలోచనలు అనసూయకు లేకపోవడం రంగనాయకమ్మకు కోపం తెప్పించాయి కాబోలు. ప్రపంచంలో అందరూ తనకు నచ్చినట్టే ఉండాలనుకునే వ్యక్తికి నిస్వార్థమైన ఆలోచనలు తమాషా అవడం అతి సహజం.
ఇవన్నీ పక్కన పెడితే ముగ్గుబుట్ట తల అని ముసలివాళ్ళను కించపరచడం రంగనాయకమ్మ కండకావరాన్ని సూచిస్తుంది. వార్థక్యం అనేది ప్రతీ మనిషికి సహజమైన దశ. దాని గురించి ఇంత నీచంగా మాట్లాడటం వ్యక్తిలోని పైశాచిక ప్రవృత్తిని బయటపెడుతుంది. మరి రంగనాయకమ్మకు రాలేదా ముసలితనం?? ఇలాంటి వ్యక్తిని ప్రజలు స్త్రీవాదిని అని, మరొకటని పొగుడుతుంటే వాళ్ళ అజ్ఞానానికి జాలిపడటం తప్ప ఇంకేమీ చెయ్యలేను.. 





సర్వేజనా సుఖినోభంతు
-రామదండు.




Wednesday 6 June 2012

పీఠికలోనే మొదలైన పీడ: వంకర లాజిక్కులు

రుషులపైన అక్కసు:
పదేళ్ళు వర్షాలు లేవు లోకమంతా దగ్ధమవుతూ ఉంది. అనసూయ తన పాతివ్రత్యం తో రుషులకోసం చెట్లకి పళ్ళు, గంగలో నీళ్ళూ సృష్టించింది. ఇదీ కథ! దీని మీద కూడా మనలోకజ్ఞానం ప్రశ్నల వర్షం కురిపిస్తుంది- " ఏ మనిషికైనా పళ్ళూ, నీళ్ళూ సృష్టించడం  సాధ్యమౌతుందా?? అంత సృష్టించగలిగేప్పుడు పళ్ళని చెట్లకే సృష్టించడం ఎందుకూ? చెట్లెక్కే శ్రమ మాత్రం ఎందుకు?? పళ్ళని చేతుల్లోనే సృష్టించరాదూ??" ఇలా ఎంతైనా తర్కించవచ్చు. కానీ, మన ప్రశ్నలు ఇంతటితో ఆగిపోతే ఈ కథనుంచీ మనం తెలుసుకోగలిగేది ఏమీ ఉండదు. ఈ కథలో కొన్ని సాంఘిక విషయాలు ఉన్నాయి. అవేమంటే స్త్రీలు పూర్తిగా పాతివ్రత్యాన్ని ఆమోదించారు. అది సమాజం లో గౌరవప్రదం అయిపోయింది. అంతే కాదు, ఆ పతీవ్రత పళ్ళూ, నీళ్ళూ సృష్టించింది ఎవరికోసం? రుషుల కోసం! రుషులకోసం మాత్రమే ఎందుకు సృష్టించాలి? లోకాలన్నీ దగ్ధమౌతున్నప్పుడు ప్రజలందరూ కష్టాలు పడుతుండరా? అందర్నీ రక్షించాలి కదా?? "సమస్త జనుల కోసం సృష్టించింది" అని ఎందుకు చెప్పలేదు. ఎందుకంటే చెప్పేవారికి సమస్త జనుల శ్రేయస్సు  అవసరం లేదు గనక, రుషుల రక్షణ ఒక్కటే వారి ధర్మం గనక! ఎవరికి శక్తిసామర్థ్యాలున్నా, ఎక్కడ సిరిసంపదలున్నా అవి రుషుల శ్రేయస్సుకే ఉపయోగ పడాలి ఎందుచేత ఇతర ప్రజల సంగతేమిటి??

చెట్లెక్కే శ్రమ ఎందుకూ అని రంగనాయకమ్మ కు అనిపించి ఉండచ్చు. కానీ అప్పటి ప్రజలు రంగనాయకమ్మ అంత సోమరులు కాదని  వాల్మీకి మహర్షికి తెలుసు కాబోలు అందుకే అలా రాశాడు.ఇక రుషుల మీద అక్కసు మిగిలిన పేరాలో  ఎత్తికొట్టినట్టు కనిపిస్తుంది. ఆ పళ్ళూ, నీళ్ళు అనసూయ సృష్టించింది రుషులకు మాత్రమే అని ఎక్కడ చెప్పారు?? అవి రుషులకోసం అంటే మిగిలినవారికి కాదు అనుకోవడం ఒక ఊహ తప్ప నిజం కాదు. ఇది పక్కన పెడితే, ఎవరికోసం చెయ్యాలో అనసూయకు రంగనాయకమ్మ చెప్పడం ఏమిటి ? ఆమె పాతివ్రత్య బలం తో ఆమెకు ఇష్టమైనవాళ్ళకు మేలు చేస్తుంది. ప్రజలందరికీ మేళ్ళు చేయడానికి అనసూయ పబ్లిక్ సర్వెంట్ కాదు, బాండేడ్ లేబర్ అంతకు ముందే కాదు. ఇంకా నయం , అనసూయ తన పాతివ్రత్య బలం తో మార్కిస్టులకు సకల సదుపాయాలు ఇవ్వాలని వాదించలేదు. ఇలాంటి అర్థం లేని వాదనలు ఈ పుస్తకం లో చాలానే ఉన్నట్టున్నాయి. రాజు పెద్దభార్య సామెత లాగా మాటిమాటికి సాధారణ ప్రజల ప్రస్తావన తెచ్చి వాళ్ళను విక్టిమైజ్ చెయ్యాలని చూడటం ఈ పుస్తకం లో తరచుగా కనిపిస్తుంది. ఎందుకంటే, సాధారణ ప్రజల గురించి వకాల్తా పుచ్చుకున్నట్టు ఎంత ఎక్కువ ఫోజు కొడితే అంత ఎక్కువ మార్కెట్ పెరుగుతుంది. ఈ పుస్తకం రాసినప్పుడు మన రాష్ట్రంలో కమ్యూనిస్టులు చెప్పుకోదగ్గ సంఖ్య లో ఉండేవాళ్ళు ఇలాంటివి రాయకపోతే వాళ్ళెవరూ ఈ పుస్తకాన్ని కొనరు. మార్కెట్ ప్రకారం రచనలు చెయ్యకపోతే కమర్షియల్ రచయితలకు విలువలేదు.

ఇక రాజులవంతు:
రాముడి పట్టాభిషేకం వార్త తెలియగానే కైక ఉదాసీనంగా ఉంటుంది. దశరథుడు కారణం తెలియనట్టు ఆమెని బతిమాలుతూ ఇలా అంటాడు -  "కైకేయీ ఎందుకీ విచారం చెప్పు? నువ్వేం కోరితే అది చేస్తాను. ఎవరినైనా చంపించాలని ఉందా, చెప్పు? అతడెంత నిర్దోషి అయినా నీ సంతోషం కోసం చంపేస్తాను. ఎవర్నైనా రక్షించాలని ఉందా , చెప్పు? అతడెంత దోషి అయినా శిక్ష రద్దు చేస్తాను. ఈ విధంగా సాగుతుంది దశరథ మహారాజు గారి ప్రేలాపన. ఏ రాజైనా తను తల్చుకున్నది యధేచ్చగా న్యాయాన్యాయాలతో సంబంధం లేకుండా చేసెయ్యగలడన్నమాట. రాజు ప్రాపకం గానీ రాణుల ప్రాపకం గానీ సంపాదించుకుంటే ఎటువంటి కార్యాలైనా సాధించుకోగలరన్నమాట. వారి ఆగ్రహానికి గురైన వారు, అతీగతీ లేకుండా సర్వ నాశనం అయిపోతారన్నమాట. అందుచేత ఒక వ్యక్తి చేసే నిరంకుశ పాలన లో ప్రజలకు న్యాయం జరగడం కల్ల. దశరథుడు న్యాయం చేసినా అంతే; రాముడు రాజ్యం  చేసినా అంతే; పుల్లయ్య  రాజ్యం చేసినా అంతే!

"రాజులకు అన్యాయాలు చేసే అవకాశం ఉండేది" అని చెప్పుంటే బాగుండేది. ఎందుకంటే పైన పేరాలో ఎక్కడ కూడా దశరథ మహారాజు అన్యాయాలు చేసినట్టు చెప్పలేదు. చెయ్యగలనని చెప్పాడు. ఒకమనిషి ఒక పని చెయ్యడం వేరు చేస్తానని చెప్పడం వేరు. అప్పటికాలం లోని తర్కజ్ఞానం గురించి అవాకులు, చెవాకులు పేలిన రంగనాయకమ్మ ఈ మాత్రం తార్కిక దృష్టితో ఆలోచించలేకపోవడం కడు విషాదం. ఒక భర్త తన భార్య అలక తీర్చడానికి చెప్పిన మాటలను బట్టి ఆయన అలా చేశాడనే కంక్లూజన్ కు రావడం ఏ తర్క జ్ఞాన పుస్తకం లో ఉందో నాకైతే తెలియదు. ఇక మరోసారి జెనరలైజేషన్; దశరథ మహారాజు అలా చేయగలనని చెప్పాడు, దాన్నుంచీ రాజులందరూ అన్యాయాలు మాత్రమే చేస్తారని చెప్పడం.. ఎలాగైనా రాజులను తప్పు పట్టాలన్న దుర్బుద్ది తప్ప మరొకటి కాదు.  వ్యక్తిపాలనలో న్యాయం జరగదు అని చెబుతున్న రంగనాయకమ్మ నియంతృత్వ పోకడలకు మారుపేరైన కమ్యూనిజాన్ని సమర్ధించడం గురివింద నైజం. 

గంగ ఒడ్డు దిగాక సుమంత్రుడితో రాముడు: భరతుడిని, నా తండ్రినీ సేవించుకుంటూ ఉండు! రాజులు అపజయాలు, దు:ఖాలు భరించలేరు. తమ మనసులోని కోర్కెలు నిర్విఘ్నంగా తీర్చుకోవాలని రాజులు కలలు కంటారు. భరతుడికి సేవలు చేస్తూ ఉండమని నా తల్లితో చెప్పు. చిన్నవాడనే నిర్లక్ష్యం కూడదు. రాజుని పూజించడానికి వయసుతో నిమిత్తం లేదు. సిరిసంపదల వల్లనే రాజు అందరికన్నా అధికుడు, పూజ్యుడూ అవుతాడు.
చిత్రకూటంలో లక్ష్మణుడితో రాముడు: నేనసలు రాజ్యం ఎందుకు చేయాలనుకుంటున్నానో తెలుసా? నా తమ్ములందరూ సిరి సంపదలతో, రాజ భోగాలతో, సర్వ సౌఖ్యాలతో ఎల్లకాలం తుల తూగాలని" . 
ఈ రకంగా రాముడు తన కోర్కెలు తీర్చుకోవడానికి, తన బంధు మిత్రుల్ని సుఖపెట్టడానికీ, తనకు విధేయంగా లేని ప్రజల అంతు తేల్చడానికి రాజ్యం చేయాలనుకున్నాడన్నమాట. ఇలా పరిపాలించే రాముడి రాజ్యమేనా ప్రజలు కలలుగనే "రామరాజ్యం"?
  
రంగనాయకమ్మ హైందవ మతం మీద దాడి చేయడానికి ఎంత నికృష్టమైన లాజిక్కులు చెప్పిందో ఈ పేరా చూస్తే తెలుస్తుంది. ఈ మొత్తం పేరాలో రాముడు తనకోర్కెలు ఎక్కడ తీర్చుకున్నాడో ఎవరైనా చెబుతారా?? తన తమ్ములు సుఖంగా ఉండాలని కోరుకోవడం కూడా తప్పేనా? మనం ప్రేమించే ప్రతీ వ్యక్తీ సుఖంగా ఉండాలనే ఆకాంక్షిస్తాం. అందులో కూడా స్వార్థమనే కోణాన్ని చూడటం కేవలం కమ్యూనిస్టులకు మాత్రమే సాధ్యం కాబోలు. తనకు విధేయంగా లేని ప్రజల అంతు చూడటానికి రాజ్యం చేయాలనుకున్నాడని రంగనాయకమ్మ ఆరోపించింది. పైన పేరాలో ప్రజల ప్రస్తావన ఎక్కడ వచ్చిందో కొంచెం చెబుతారా?? ఆవు వ్యాసం టైపులో ప్రతీ పేజీలో కనీసం రెండు సార్లు రాముడు ఇలా తప్పు చేశాడు, ప్రజలు కష్టాలు పడ్డారు అని అరిగిపొయిన రికార్డ్ తప్ప మరొకటి కాదు. రాముడు ప్రస్తుతకాలానికి చెందనివాడు కాబట్టి ఏమైనా ఆరోపించచ్చు. ఎవరైనా ఎదురు చెబితే వాళ్ళను "చాంధసులు" అని ముద్రవేసి హేళన చేయవచ్చు. మాటిమాటికీ ప్రజలు ప్రజలు అని ముసలి కన్నీరు కారుస్తూ ఎంచక్కా పుస్తకాలు అమ్ముకోవచ్చు. రంగనాయకమ్మ తన స్వార్థం కోసం, కేవలం తన స్వార్థం కోసం ఒక మతం గురించి ఎంతటి విషప్రచారం సాగించిందో చూడండి. మొత్తంగా చూస్తే రంగనాయకమ్మ మార్కెటింగ్ స్ట్రాటెజీ నుంచీ ప్రతీ ఒక్క మార్కెటింగ్ మేనేజర్ నేర్చుకోవాల్సింది ఎంతైనా ఉంది. 

సర్వేజనా సుఖినోభవంతు,
-రామదండు 



Sunday 3 June 2012

పీఠిక లోనే మొదలైన పీడ: రామదూషణ

పీఠిక లో రామదూషణ చాలానే  జరిగింది. దూషణ అని ఎందుకన్నానంటే ఇది విమర్శ  స్థాయి దాటి చాలా దూరం వెళ్ళింది. ఉదాహరణకు క్రింది వాక్యాలు చదవండి:
రాముడికి నిజంగా ఉన్న లక్షణాలు:
౧.లోకాన్ని మోసపుచ్చే అబద్దపు వ్రతాలు
౨.ఎప్పుడూ ఎదుటివాడికి నీతులు బోధిస్తూ ఉండటం
౩.కపట గాంభిర్యం
౪. రెండు నాలికల మాటలు
౫.తనే జ్ఞానిననే అజ్ఞానం
౬.తనకు సేవలు చేసే ఆప్తులని శంకించి అవమానించడం
౭.నిస్సహాయులని ఘోరాతి ఘోరంగా హింసిచడం


ఈ లక్షణాలన్నీ రాముడిలో ఉన్నాయని రంగనాయకమ్మ రాసింది. అందుకు ఆమె ఇచ్చిన కారణాలు విషవృక్షం లోపలి పేజీలలో ఉందని ఆశిద్దాం (అవి ఎంతమాత్రం లాజికల్ అనేది తరువాత సమస్య). కనుక ఈ పుస్తకం లోపలిపేజీలలోకి వెళ్ళేముందు ఈ లక్షణాలకు సంబంధించిన జస్టిఫికేషన్ కోసం చూడాలి. సరే, ఆ విషయం పక్కన పెడితే  ఈ లక్షణాలన్ని రాముడికి నిజంగా ఉన్నాయని అనడం కంటే  తనకు రాముడిలో కనిపించిన విషయాలు అని రంగనాయకమ్మ  రాసుంటే బాగుండేది. ప్రతీచోటా ఇలాంటి జెనరలైజ్ చేస్తూ రాయడం రంగనాయకమ్మ శైలి అనుకుంటా..

ఇప్పుడు ఇంకొక విషయానికి వద్దాం:
అసలు పితృవాక్య పరిపాలన అనేది  ఒక బూటకపు ధర్మం. ఆ  ధర్మం పాటించడానికి నానా కష్టాలు పడాలంటే ఏ కొడుక్కి ఆత్మలోంచి నిజమైన సంతోషం రాదు. కానీ సమాజం లో అదే గొప్ప కీర్తి గా చెలామణి అవుతుంది కాబట్టి , దాన్ని సంతోషంగా పాటిస్తున్నట్టు పైకి నటన ! ఆత్మ వంచన! పరవంచన!కీర్తి కాంక్ష!గొప్ప ఆదర్శాన్ని పాటిస్తున్నామనే భ్రమ. కీర్తి కోసం వీపుమీద ఒక పర్వతం ఎత్తుకుంటే తిన్నగా నడవడం సాధ్యమేనా? - కాదు. అది ఎలా సాధ్యం కాదో బూటకపు సంఘనీతులు, గందరగోళపు ధర్మాలు పాటించవలసివస్తే ఏ వ్యక్తీ వీటికోసం స్వచ్చంగా, నిష్కల్మషంగా నిర్విచారంగా ప్రవర్తించడం సాధ్యం కాదు.

పితృవాక్య పరిపాలన అనేది రంగనాయకమ్మకు బూటకపు ధర్మమట.. ఎందుకు?? ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే రామయణ కావ్యం  లో పితృవాక్య పరిపాలన అనేది చాలా ముఖ్యమైన విషయం. దాన్ని బూటకం అనడం ద్వారా రంగనాయకమ్మ రాముడు చేసిన మిగతా పనులను చులకన చేయడానికి ఒక చక్కని ప్లాట్ ఫారం ఏర్పాటు చేసుకుంది. బూటకం అని రాసింది కానీ ఎందుకు బూటకం అనేది చెప్పలేదు.. ఆత్మలోంచి నిజమైన సంతోషం రాదు. అని రాయడం నన్ను ఆశ్చర్య పరచింది. భౌతిక వాదినని చెప్పుకునే రంగనాయకమ్మ ఇలా ఆత్మలూ, దయ్యాలు అని మాట్లాడటం ఏమిటో??
పై వాక్యాన్ని మరో కోణం లో  ఆలోచిస్తే రాముడు చేసిన ఏ పనినైనా తిట్టాలనే తపన కనిపిస్తుంది. ఎందుకంటే మహిళ అయినరంగనాయకమ్మకు తల్లిదండ్రులకు ఏం చేస్తే కొడుకులు సంతోషపడతారో తెలిసే అవకాశమే లేదు. ఇక్కడ సమస్య రంగనాయకమ్మ మహిళ కావడం కాదు. ఆమెకు కుటుంబ విలువల పట్ల గౌరవం లేకపోవడం. ఇక రాముడు ఆత్మవంచన చేసుకున్నాడని నిందించడం. రాముడు ఆత్మవంచన చేసుకున్న విషయం ఈవిడ గారికి ఎలా తెలిసిందో ఎవరికైనా తెలిస్తే చెప్పగలరు. ఇక గొప్ప ఆదర్శాలను పాటిస్తున్నామనే భ్రమ  అని రాసింది. ప్రతీ మనిషి తన ఆదర్శాలను గొప్పవనే నమ్ముతాడు లేకపోతే అ ఆదర్శాలు పాటించలేడు. మరి రాముడి ఆదర్శాల గురించి  ఇన్ని మాటలు మాట్లాడుతున్న రంగనాయకమ్మ కొన్ని  లక్షల మందిని పొట్టన పెట్టుకున్న మార్క్సిస్ట్ సిద్దాంతాలను మాత్రం గొప్పవని ఎలా చెబుతుంది?? ఇది ఆత్మ వంచన అవునో కాదో చెప్పలేను కానీ ఖచ్చితంగా పర వంచనే.. 

ఇక మరొక జోకు వీపు మీద పర్వతం. ఒక నియమం ఒక మనిషికి బరువుగా అనిపించవచ్చు. కానీ అది అందరికీ బరువు కావాల్సిన అవసరం లేదు. ఉదాహరణకు ఉదయం ఆరు గంటలకు నిద్ర లేవడం అనేది మన సమాజం లో చాలామందికి బరువైన పని లా అనిపిస్తుంది కానీ కొందరికి చాలా సౌకర్యవంతంగా , ఉపయోగంగా ఉంటుంది. కాబట్టి ఆ కాలం లో రాముడికి పితృవాక్య పరిపాలన అనేది కష్టం కాక పోయి ఉండవచ్చు. ఇక మరొక విషయం, రాముడు తన తండ్రికి ముద్దుల బిడ్డ అలాంటి రాముడికి బలంతంగా ఒక నియమాన్ని పాటించాల్సిన పని లేదు. రాముడిని ఆ నియమం పాటించమని ఎవరూ బలవంత పెట్టలేదు, కాబట్టి అదేదో ఆత్మవంచన అనుకోవడం రంగనాయకమ్మ  బుద్దిహీనతను సూచిస్తుంది తప్ప మరొకటి కాదు. కుటుంబ విలువల పట్ల గౌరవం లేని రంగనాయకమ్మకు పితృవాక్య పరిపాలన ఒక భారం లాగా అనిపించవచ్చు. కానీ అది ఇతరులకు అనిపించాల్సిన అవసరం లేదు. ఇలాంటి జెనరలైజేషన్లు ఈ పుస్తకం నిండా ఉన్నట్టుగా ఉన్నాయి.

ఇదే పీఠికలో మరొక చోట రంగనాయకమ్మ ఇలా రాసింది:
రాముడికి భరతుడి హక్కు సంగతి తెలియక పోవడం వల్లనే పట్టాభిషేకానికి సిద్దపడితే అది రాముడి తప్పు అవదు. కానీ, ఆ  విషయం తెలిసీ రాముడు పట్టాభిషేకానికి సిద్దపడ్డాడంటే అది రాముడి కపటం అవదూ?? 
ఒకసారి అడవిలో పులి జింకను తినడానికి వచ్చిందట. జింక " నేను నీకేమీ అపకారం చెయ్యలేదు. నన్నెందుకు తింటావ్?" అని అడిగింది. దానికి పులి " నదిలో నీళ్ళు తాగి నీళ్ళు ఎంగిలి చేశావ్ అని చెప్పిందట"
ఇలా ఉంది రంగనాయకమ్మ వైఖరి. ముందు రాముడు భరతుడి గురించి తెలిసి కూడా రాజ్యం అడగటం తప్పు అని చెప్పింది. పితృవాక్య పరిపాలన అనేది రాముడి నియమం అంటే, అది బూటకం అంటుంది. స్థూలంగా రాముడు ఏం చేసినా తప్పే(రంగనాయకమ్మ దృష్టిలో) దాన్ని ఏదో విధంగా జస్టిఫై చేసుకోవడానికి ఈ సర్కస్ వేషాలు.. ఈ ధోరణి కేవలం రాముడిపై ఆమెకున్న ద్వేషాన్ని ఎత్తి చూపుతుంది తప్ప మరొకటి కాదు.

తర్వాత పేరా:
కవి రాసే నీతులు అనేకం పరస్పర విరుద్దంగా ఉండటానికి కారణం ఆ నీతులను నిర్దేశించే సమాజం లో హేతువాదానికి, తర్క జ్ఞానికి స్థానం లేకపోవడమే.. సమాజం లో లేని తర్క జ్ఞానాన్ని కవి తన రచనలలో చూపించలేడు.ప్రకృతి విరుద్దమైన కల్పనలతో, కపటత్వాలతో , మర్మ గుణాలతో ఆత్మ వంచన చేసుకునే సమాజం లో కవీ వంచకుడే..

అప్పటి తర్కజ్ఞానం గురించి మాట్లాడుతున్న రంగనాయకమ్మ తర్క జ్ఞానమెంతనో త్వరలోచూద్దాం.Depression/violence తో నిండిపొయిన ప్రస్తుత సమాజం లో రంగనాయకమ్మ  ఏమౌతుంది?? డిప్రెషన్ పేషెంట్ ? లేక బ్లడ్ మాంగర్?? ఎవరి చాయిస్ వాళ్ళది. ఆఖరికి రామాయణాన్ని గ్రంథస్తం చేసిన వాల్మీకి మహర్షిని దూషించడానికి రంగనాయకమ్మ ఏ మాత్రం వెనకాడలేదు. ఆమెలోని ద్వేషాన్ని తెలియజేసేందుకు ఇంతకంటే పెద్ద సూచిక అవసరం లేదు. 


స్థూలంగా చూస్తే పీఠిక లోని ఈ సెక్షన్ లో కొన్ని విషయాలు స్పష్టం అవుతాయి:
౧. రాముడిని దూషించడం లో రంగనాయకమ్మ  చాలా ఆరితేరిన మనిషి. బహుశా అందులో ఆనందాన్ని పొందుతుంది కాబోలు.
౨. ప్రతీ విషయాన్నీ తనే ప్రధమం అనే కోణం లో ఆలోచించడం రంగనాయకమ్మ నైజం. దీన్నే ఇంగ్లీష్ లో Ego Centric Attitude అంటారు. 

సర్వేజనా సుఖినోభవంతు
-రామదండు  


Monday 28 May 2012

రామాయణమే ఎందుకు??

ఈ  విష వృక్షం గురించి తెలిసినప్పుడు నాకు వచ్చిన మొదటి డౌటు "రామాయణమే ఎందుకు?? వేరే పుస్తకాల గురించి ఎందుకు రాయలేదు" వేరే పుస్తకాలంటే ఖురాన్, బైబిల్  లాంటివి కాదు. ఎందుకంటే వాటి గురించి రాసుంటే రాసిన రంగనాయకమ్మ పబ్లిష్ చేసిన పబ్లిషర్ ఇద్దరూ కాలగర్భం లో కలిసిపోయి కనీసం మూడు దశాబ్దాలు అయ్యేది. భారతం విషవృక్షం , భాగవతం విషవృక్షం లాంటివి రాసి ఉండచ్చు. తిట్టడమే ధ్యేయమైనప్పుడు ఏ పుస్తకాలైతే ఏం తేడా వస్తుంది?? పై పెచ్చు రాముడి ఆత్మ, సీత లో సీత లాంటి పాత్రలు సృష్టించడానికి  కూడా పుస్తకం ఏమిటన్నది అనవసరం. అయినా కూడా రంగనాయకమ్మ రామాయణాన్నే ఎంచుకుంది. దీనికి  నాకు తోచిన కారణాలు ఇక్కడ రాస్తున్నా..

౧. ఫలానా ఎవరు??
తెలుగు సినిమా డైరెక్టర్ యస్వీ కృష్ణారెడ్డి గారి మొదటి సినిమా పేరు "కొబ్బరి బోండాం". ఆ సినిమాకు ఆ పేరేందుకు పెట్టారని అడిగితే దానికి ఆయన ఇచ్చిన సమాధానం "ఆ పేరు వింతగా ఉంది కాబట్టి అందరూ సినిమా తీశింది ఎవరు అని ఇంటరెస్ట్ చూపిస్తారు, మొదటి సినిమా తర్వాత నాకు అది ఉపయోగ పడింది అని". రంగనాయకమ్మ కూడా ఖచ్చితంగా ఈ సిద్దాంతాన్నే వాడుకుంది. ప్రచారం రావాలంటే ఎదో ఒక గొప్ప పని చేస్తే రావాలి లేదా ఎవరైనా  ఆల్రెడీ ఫేమస్ వ్యక్తి ద్వారా రావాలి. రంగనాయకమ్మ నమ్మే మార్క్స్ -మావో ఈ దేశానికి ఏ మాత్రం సంబంధం లేని వారు.. వారి భజనలు ఎంతగా చేసినా ఎవరూ పట్టించుకోరు. అందుకని ఈ మార్గం లో వార్తలలో నిలిచింది. ఇందులో తప్పేమీ లేదు. కీర్తి కండూతి మనిషిలోని జ్ఞానాన్ని చంపేస్తుంది అంటారు.
౨. publicity mongering
౨౦౦౬ లో మొయిన్ ఖాన్ అనే పాకిస్తానీ క్రికెటర్  "సచిన్ కళ్ళల్లో భయాన్ని చూశాను" అని స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆ తర్వాత రోజు  యాహూ సెర్చ్  టాప్ సెర్చెడ్ ఐటెంస్ లో మొయిన్ ఖాన్ పేరు ఉంది. రంగనాయకమ్మ చేసింది ఇదే.. చాలా కాలం క్రితం కవి సామ్రాట్ విశ్వనాథ గారు "రామాయణ కల్పవృక్షం" అనే ఒక పుస్తకం రాశారు. అందులో రామాయణం నుంచీ నేర్చుకోవాల్సిన విలువల గురించి రాశారు. కవి సామ్రాట్ రాసినదాన్ని విమర్శించారంటే సహజంగానే పాఠకులలో కుతూహలం ఉంటుంది దాన్ని సొమ్ము చేసుకోవచ్చు. ఈ రకంగా చేయడం తప్పూ కాదు అందులో ఏ రకమైన దోషం కూడా లేదు. ఎవరి మానసిక స్థాయికి తగ్గ పనులు వాళ్ళు చేస్తుంటారు. దానికి వాళ్ళను తప్పు పట్టలేము. స్వాతి చినుకు  ముత్యపు చిప్ప పైన పడితే అది ముత్యమౌతుంది తాచుపాము తలపై పడితే అది విషమౌతుంది.
౩. సినిమాల ప్రభావం:
విషవృక్షం మొదటి  పుస్తకం వచ్చింది ౧౯౭౫ ప్రాంతం లో.. అంతకు రెండు మూడు దశాబ్దాలుగా రాముడి గురించిన సినిమాలు   ప్రతీ రెండు మూడేళ్ళకు ఒక సూపర్ హిట్ సినిమా రానే వచ్చింది.ఇంక రామాయణం నాటకాలు, బుర్ర కథలు వగైరా వీటికి అదనం. ఇక భద్రాచలం లాంటి  ప్రసిద్ద పుణ్య క్షేత్రాల ద్వారా రాముడి గురించిన విషయాలు ఎప్పుడు ఏదో విధంగా చర్చలలో ఉండనే ఉంటాయి. ఇంత పాపులర్ అయిన రాముడి గురించి ఏం రాసినా అది వార్తే అవుతుంది. ఈ పాయింట్ ను రంగనాయకమ్మ పూర్తిగా వాడుకుంది.
౪. మార్కిజం:
రంగనాయకమ్మ  మార్క్సిస్ట్ అనే విషయం తెలిసిందే. ఆ సిద్దాంతాలను ప్రజలకు చెప్పాలి అంటే ముందుగా  సమాజం లో ఉన్నతంగా ఉండే వ్యక్తులను/విలువలను టార్గెట్ చెయ్యాలి. మన సమాజం లో రాముడు ఆ పొజిషన్ లో ఉన్నాడు (శతాబ్దాలుగా). ప్రతీ పురుషుడికి రాముడిని ఆదర్శ మూర్తిగా మన పెద్దలు చెబుతారు. అలాంటి రాముడి తెగడుతూ రాస్తే  "అసలు రాముడిని తిట్టాల్సినంత అవసరం ఏమొచ్చింది?" అనే ఇంటరెస్ట్ పుస్తకం కొనేవాళ్ళు ఉంటారు. పైగా అవసరం అయినా లేకపొయినా తను నమ్మిన కమ్యునిజం గురించిన విషయాలు చెప్పటానికి ఒక ప్లాట్ ఫారం దొరుకుతుంది. (విషవృక్షం  పుస్తకం మొదటి పేజిలో "నీ గురించి నువ్వు తెలుసుకో, నువ్వు ఏ వర్గమో తెలుసుకో" -మార్స్కిస్ట్ అని ఉంటుంది.)

పైన చెప్పిన కొన్ని కారణాల వల్ల రంగనాయకమ్మ  తన పైత్య ప్రకోపాన్ని విశృఖలంగా ప్రదర్శించడానికి  రామాయణాన్ని ఎంచుకుంది.

ఇక ఇప్పుడు రంగనాయకమ్మ అభిమానులు ఈ పుస్తకం గురించి చెప్పిన విషయాలు చూద్దాం:
౧. స్త్రీ అభ్యుదయం వగైరా:
దీని గురించిన సమగ్రమైన చర్చ మరొక టపాలో చేస్తాను. (ఆ టపాకు ఇంకా కొంచెం టైం ఉంది)
అంతలోపు ఒక విషయం, స్త్రీల గొప్ప తనం గురించి రాయాలంటే  రాణీ రుద్రమ్మ దేవి నుంచీ  నేటి జాతీయోద్యమం వరకూ చాలామంది ధీరవనితలు ఉన్నారు. వారి గురించిన విషయాలు స్పూర్తిదాయకంగా రాయచ్చు. కానీ అవి ఎందుకు రాయలేదు?? కమ్యూనిస్టులకు భారతీయులు సరిపోరు అనుకుంటే ఫ్లోరెంస్ నైటింగేల్, జోన్ ఆఫ్ ఆర్క్ లాంటి వాళ్ళ గురించి కూడా రాయలేదు.. ఎందుకట?? male bashing is NEVER equal to woman empowerment.

౨.ఆ పుస్తకం   మూడు సార్లు పున:ముద్రణ పొందింది. అది ఈ పుస్తకం పాపులారిటీని సూచిస్తుంది:
మూడు సార్లు పున: ముద్రణ పిందడం ఏ పుస్తకానికైనా చాలా మంచి విషయం. కానీ పున:ముద్రణ వెనకాల ఉన్న  కారణాలను చూద్దాం:
అ) అప్పట్లో ఆడవాళ్ళకు పత్రికలు/పుస్తకాలు చాలా ఎక్కువగా చదివేవాళ్ళు. వాళ్ళను విక్టిమైజ్ చేస్తూ  రంగనాయకమ్మ బలిపీఠం లాంటి ఊకదంపుడు పుస్తకాలు రాసింది. సహజంగా  అలాంటి రచయిత నుంచీ వచ్చిన రచనలంటే వాళ్ళకు ఆసక్తి ఉంటుంది. ఆ లేడీ మార్కెట్ ను బాగా వాడుకుంది.
ఆ) మిషనరీలు రాముడిని దూషించడానికి తమ దేవుడు గొప్ప వాడని చెప్పుకోవడానికి ఈ పుస్తకాన్ని వాడుకుంటున్నారు. ౧౯౯౮ లో ఒకానొక మిషనరీ రామాయణ విషవృక్షం పుస్తకం లోని విషయాలను చూపిస్తూ రాముడిని కించపరచడం నేను చూశాను. అంతే కాక ఈ వ్యాసం రాయడానికి ముందు నాకు తెలిసిన కొందరు వీ.హెహ్.పీ. కార్యకర్తలకు ఫోన్ చేసి ఈ విషయాన్ని కంఫరం చేసుకున్నాను. వాళ్ళకు మిషనరీల మోడస్ ఆపరెండీ బాగా తెలుసు. మరి రంగనాయకమ్మ మిషనరీల దగ్గర నుంచీ ఎంత డబ్బు తీసుకుందో నాకు తెలీదు. 
ఇ) కమ్యూనిస్టులు ఈ  పుస్తకాన్ని తమ క్యాడర్లలో పంచడం.

౩. మొన్న మరొక కమ్యూనిస్టు చెప్పినట్టు వర్గ దృక్పథం:
సమాజమంతా ఎప్పుడూ ఒకటిగా లేదు. అది వర్గాలుగానే ఉంది అనేది కమ్యూనిస్టుల భావన. ఆ భావజాలాన్ని endorse చేసేందుకు ఈ పుస్తకం పనికి వచ్చింది.

సర్వేజనా సుఖినోభవంతు.
- రామదండు.
 

Thursday 24 May 2012

పీఠిక లోనే మొదలైన పీడ - 2: కొన్ని కామెడీలు

ముందుగా ఈ క్రింది వాక్యాలు చదవండి. ఇవి విషవృక్షం పుస్తకం యొక్క contents గురించి రంగనాయకమ్మ రాసినవి.

ఈ కథల్లో ముఖ్యంగా నాలగు విషయాలు ఉంటాయి:
1. కవి చెప్పవలసి ఉండి కూడా చెప్పనివి
2. చెప్పడానికి ఇష్టపడనివి
3. చెప్పినా మసిపూసి మారేడు కాయ చేసినవి
4. చాలా స్పష్టంగా చెప్పినవి

 1. కవి చెప్పవలసి ఉండి కూడా చెప్పనివి
ఇంతకంటే అర్థం లేని  వాదన ఏమన్నా ఉంటుందా?? వాల్మీకి మహర్షి ఏం చెప్పాలో ఏం చెప్పకూడదో కూడా రంగనాయకమ్మనే నిర్ణయించాలా?? ఆయన పుస్తకం ఆయనకు నచ్చిన విధంగా రాసుకునే స్వతంత్రం ఆయనకు లేదా?? కమ్యూనిస్టుల కాలం లో పుట్టకపోవడం వల్ల ఆయనకు నచ్చిన విధంగా రాసుకునే హక్కు ఆయనకు ఉణ్ణింది. ఆ ప్రకారమే ఆయన రచించాడు.రంగనాయకమ్మ ఈ విషయం రాసింది సరే, కనీసం పుస్తకం అచ్చు వేసేటప్పుడు ఎడిట్ చేసే ఎడిటర్ కన్నా ఈ విషయం  వింతగా అనిపించలేదా??  సాటి రచయితకు( వాల్మీకి మహర్షి మరణించి ఉండచ్చు గాక)  కనీసం గౌరవం ఇవ్వలేదని అనిపిస్తోంది. 

2. చెప్పడానికి ఇష్టపడనివి
వాల్మీకి మహర్షికి ఏమి ఇష్టమో, ఏమి ఇష్టం లేదో కూడా రంగనాయకమ్మ నే డిసైడ్ చేస్తుందన్నమాట!!  శెబాసో!

3. చెప్పినా మసిపూసి మారేడు కాయ చేసినవి
ప్రతీ రచయిత/కవికి తమకంటూ ఒక శైలి అంటూ ఉంటుంది. వాల్మీకి మహర్షి ఆయన సొంత శైలిలో ఆయన రాశాడు. అంతమాత్రం దానికి మసిపూసి మారేడు కాయ చేశాడని అనటం ఎలాగైనా నిందించాలనే తపన తప్ప మరొకటి కాదు. My dear lady! Get Well Soon!

4.చాలా స్పష్టంగా చెప్పినవి
స్పష్టంగా చెప్పినవి అనేకంటే "నాకు స్పష్టంగా అర్థం అయినవి" అని రాసుంటే బాగుండేది. ఎందుకంటే ఆమెకు స్పష్టమైనవి అందరికీ స్పష్టం కావాలని రూల్ లేదు. ఆమె స్పష్టత ఏపాటిదో ముందు ముందు చూద్దాం.

ఇప్పుడు పైన చెప్పిన నాలగు కేటగిరీల గురించి రంగనాయకమ్మ రాసిన విషయాలు చూద్దాం:

1.కవిచెప్పవలసి ఉండి కూడా చెప్పనివి:
గొడ్లని కూడా పేజీల తరబడి వర్ణించిన కవి, 'ఊర్మిళ '  సంగతి ఎక్కడా ఎత్తలేదు. ఈపాత్ర గురించి ఒక్కమాటైనా చెప్పనవసరం లేదా?? భర్తతో అడవికి వెళ్ళిన సీత గొప్ప పతీవ్రత అయినప్పుడు, భర్తతో వెళ్ళని ఊర్మిళ సీత అంత పతీవ్రత అవదు కదా.. కాబట్టి, ఈ ఆధారంతో, ఊర్మిళ భర్త పట్ల అనాసక్తంగా ఉందని, ఈమె సీత అంత మహాపతివ్రత కాదని నేను రాస్తే, అది నా స్వంత కల్పన అవుతుందా?? ఇది మూలం లో లేని ఘటనే అయినా, "మూల విరుద్దం" అనటానికి వీలుందా??

ఒక స్త్రీ పాతివ్రత్యాన్ని బేరీజు వేయడం ఏమిటో?? దానికి మళ్ళీ  ఫలానా మెట్రిక్ ఆధారంగా అన్నాను అని చెప్పుకోవడం. ఇదే లాజిక్ ఒకానొక మహిళ కు ఆపాదిస్తే ఎలా ఉంటుంది అని నాకనిపిస్తోంది. కానీ పెద్దలు, గురువులు నేర్పిన సంస్కారం అడ్డం పడుతోంది. ఈ విషయం మీద మరింత చర్చ మరొక సందర్భం లో చేద్దాం. 
గొడ్లని కూడా అని రాయడం వెనుక జంతువుల పట్ల రంగనాయకమ్మకు ఉన్న చులకన భావం కనిపిస్తోంది. అది మానవ సహజమే అయినా ఒక పుస్తకం రాసేటప్పుడు ఇలాంటి వాక్యాలు రాకుండా చూసుకుంటే బాగుంటుంది. 

2. కవికి చెప్పడానికి ఇష్టం లేనివి:
రాముడు, లక్ష్మణుడు, సీతా అడవుల వెంటా, అప్పుడప్పుడూ పల్లెల వెంటా నడిచి వెళ్తూ ఉంటారు. వారికి దారి పొడుగునా "రుషులే" కాని ఇంకెవ్వరూ తారసపడరు. ఎందు చేత? పల్లెల్లో సామాన్య ప్రజలెవ్వరూ ఉండరా?? ఎందుకు ఉండరు?? ఉంటారు. కానీ వారిని గురించి చెప్పడం కవికి ఇష్టం లేని విషయం. ఎప్పుడూ రుషుల వంటి మహాత్ముల గురించే చెప్పాలి. కానీ అడవుల్లో ఆటవికులో కట్టెల మనుషులో కనపడ్డారని రాయడం వల్ల కావ్య సౌందర్యమేమీ కొరతపడదు. అయినా కవి అలాంటివారిని చెప్పలేదు. నేను, వాళ్ళని కూడా చెప్పాను. దారిలో అక్కడక్కడా కొందరు రైతులూ, కట్టెల మనుషులు, ఒక చాకలి, ఒక భిక్షకుడు జానపదులూ, ఇతర ప్రయాణికులూ తారసపడ్డారని నేను రాస్తే అది మూల కథకు విరుద్ధం అవుతుందా?? "అలా వీల్లేదు. అక్కడ పేదలు కనబడడం జరగదు. అది తప్పు" అని వాదించడానికి వీలౌతుందా??

నాకు పీఠిక మొత్తం లో ఎక్కువగా నవ్వు తెప్పించిన పేరా ఇదే.. అసలు కావ్యం లో లేనివి సుబ్బరంగా రాసేసి అది మూల కథకు విరుద్ధం కాదు వాదించడం ఏమిటో.. ఇలా మనకు కావాల్సినవి రాసుకుని దానికి మూలం "ఫలానా కథ" అని చెప్పడం తొండి ఆట (Foul Play). మరొక విషయం, అసలు రుషులు తప్ప ఇంకెవరి గురించి వాల్మికి మహర్షి రాయలేదనేది సత్య దూరం. అరణ్య వాసం మొదలు పెట్టాక గుహుడి గురించిన ప్రస్తావన ఉంది. కానీ రంగనాయకమ్మ ఆ విషయం మర్చిపోతుంది, ఎందుకంటే గుహుడు రాముడిని ఆరాధించాడు. వాదన చెయ్యాలంటే ఏదో ఒక కారణం ఉండాలి అంతేకానీ కేవలం వాదన కోసమే వాదిస్తే ఇలానే ఉంటాయి..  

మరొక కామెడీ:
ఒక పాత్ర ఒక అభిప్రాయాన్ని చెప్పినప్పుడు, ఆ పాత్రకి మనసులో కూడా అదే విధంగా ఉండనూ వచ్చు, ఉండకపోవచ్చు. మనిషి మనసులో తనకు ఇష్టం లేని విషయాలని, కార్యాల్ని ప్రశ్నించి, తర్కించి, వ్యతిరేకించే కంఠాలు ఉంటాయి. అందుచేత అలాంటి కంఠాలు కూడా విషవృక్షం కథల్లో పాత్రల్లా ఉంటాయి. ఆ పాత్రలు "రాముడి ఆత్మ", "లక్ష్మణుడి ఇంగితం", "సీతలో సీత" అనే పేర్లతో ఉంటాయి. అవి అప్పుడప్పుడూ వ్యక్తుల మనోభావాలను ప్రకటిస్తూ ఉంటాయి. ఇది మూల కథకు ద్రోహం చెయ్యడం అవదు. 

ఇప్పుడు పైన రంగనాయకమ్మ చెప్పిన లాజిక్ ను ఇంకొక చోట ఉపయోగించి చూద్దాం. మన ప్రారబ్దం బాలేక రంగనాయకమ్మ తన ఆత్మకథ రాసింది అనుకుందాం. అందులో "రంగనాయకమ్మ ఆత్మ" అని ఒక కంఠాన్ని ప్రవేసి పెట్టి ఆ పాత్ర చేత మనకు నచ్చిన విషయాలు రాసుకుంటే వాటికీ రంగనాయకమ్మ కు ఏమన్నా సంబంధం ఉంటుందా?? ఇది పూర్తిగా లేని భావాలను ఆయా పాత్రలకు తమకు అనుకూలంగా అంటగట్టడం తప్ప మరొకటి కాదు. పైగా ఇది మూల కథకు ద్రోహం కాదని ఆమెకు ఆమే సర్టిఫై చేసుకోవడం.  Anyways, Lets move on!

3.కవి మసిపూసి మారేడు కాయ చేసినవి
రాముడికి శతృపక్షం రాక్షసులు. ఈ రాక్షసులు ఏ జీవ శాస్త్రం లోనూ లేని కవి స్వంత సృష్టి. కథంతా దీని మీదే ఆధారపడి ఉంటుంది. కానీ ఈ కల్పనని యథాతథంగా అంగీకరించవలసిన అవసరం పాఠకులకు ఉండదు.

పాఠకులకు ఏమి అవసరమో ఏమి అనవసరమో పాఠకులకు తెలుసు వారి గురించి వకాల్తా పుచ్చుకోవాల్సిన అవసరం రంగనాయకమ్మకు ఎందుకు కలిగిందో పాపం..

4. కవి స్పష్టంగా చెప్పినవి:
కొన్ని విషయాలు కథలో ఎక్కడో ఒక చోట బయటపడతాయి.

ఎక్కడో ఒక చోట బయటపడే విషయాలు స్పష్టంగా చెప్పినవా?? కిం.ప.దొ.న.

(మరిన్ని విషయాలు మరొక పోస్టులో చూద్దాం)


రామదండు 

Sunday 20 May 2012

పీఠిక లోనే మొదలైన పీడ - 1


ముందుగా రంగనాయకమ్మ విషవృక్షం పీఠికలో రాసిన ఈ క్రింద వాక్యాలు చదవండి.

ఈ కథ వల్ల మనకు స్పష్టమయ్యే విషయాలు:

౧. సమాజం అప్పటికే ధనిక పేద వర్గాలుగా విడిపొయింది..
౨. దశరథుడు, రాముడు,రావణుడు వంటి రాజులు ధనిక వర్గ ప్రతినిధులు. అసలు వాళ్ళే సిరిసంపదలు కల ఆస్తిపరులు, ధనికులు..
౩. స్త్రీలు అస్వతుంతృలుగా , వ్యక్తిత్వ శూన్యులుగా పురుషాంధకారపు నీడలో జీవచ్చవ జీవితాలు గడిపారు.
౪. సామాన్య ప్రజానీకం- పేదతనంలో, కులభేదాలలో ముష్టితనం లో, వేశ్యా వృత్తిలో , మత మౌఢ్యం లో , ఒక జాతిని ఇంకో జాతిని ఒక వర్గం ఇంకో వర్గాన్ని పీడించే యుద్దాలలో , వెయ్యి నిలువుల లోతున కూరుకుపోయి ఉన్నారు.
౫. పాలకవర్గ సాహిత్యము, దోపిడీ సంస్కృతి , సూక్ష్మ క్రిములై ప్రజల ఆస్తుల్ని, ఆత్మల్ని పట్టేశాయి.

పైన పేర్కొన్న విషయాలన్నీ  చాలా బరువైన ఆరోపణలు కానీ ఈ ఆరోపణలు ఏ కారణం తో చేసిందో రంగనాయకమ్మ ఎక్కడా చెప్పలేదు. సరే! పీఠిక లో అన్ని విషయాలూ విశదీకరించరు అని సరిపెట్టుకోవాలన్నా అంత ఆషామాషీగా తీసుకునే ఆరోపణలు మాత్రం కాదు. ఇలాంటి బరువైన ఆరోపణలు చేసేటప్పుడు కనీసం లేశమాత్రంగానైనా వివరాలు ఇవ్వకపోవడం ఈ పుస్తకం రాయడం వెనుక సదరు రచయిత ఉద్దేశ్యాలను అనుమానించాల్సివస్తోంది.రామాయణం చదివాక ఆమె ఈ ఆరోపణలు చేస్తోందా లేక ఇలాంటి ఆరోపణలు చెయ్యడానికి రామాయణం చదివిందా/చదివానని చెప్పుకునిందా??


ఇక ఈ పీఠికతో అత్యంత ముఖ్యమైన విషయం:

"రాముడు జ్యేష్ఠ కుమారుడైనా అతనికి రాజ్యం మీద హక్కు లేదు! రాజ్యం భరతుడిదే! ఎందుకంటే దశరథుడు కైకను పెళ్ళి చేసుకునేటప్పుడు కైక బిడ్డ కే రాజ్యం ఇస్తానని వాగ్దానం చేశాడు. ఈ విషయం వాల్మికి రాసిందే . ఇది రామాయణానికంతటికీ ఆధారమైన ముఖ్య విషయం. ఇంత ముఖ్య విషయాన్ని కవి అల్ప విషయంగా ఒక మూలకు తోసేసి ,దాని సంగతి ఎప్పటికో ఎత్తాడు. రాముడు అడవుల్లో ఉన్నప్పుడు .. అప్పుడు బయటపడింది ఆ విషయం. పైగా రాముడి నోటి ద్వారానే ! అంటే, ఆ సంగతి రాముడికి మొదటినుండీ తెలుసన్నమాట."

వాల్మీకి ఈ విషయం ఏ పద్యాలలో రాశాడో రంగనాయకమ్మ చెప్పలేదు. కనీసం రామాయణం లోని ఏ  కాండ లో ఏ పద్యాలలో ఈ విషయాలు రాశారో చెప్పలేదు.

ఆ తర్వాతి వాక్యాలు ఇలా ఉన్నాయి:
రాముడికి భరతుడి హక్కు సంగతి తెలియక పోవడం వల్లనే పట్టాభిషేకానికి సిద్దపడితే అది రాముడి తప్పు అవదు. కానీ, ఆ  విషయం తెలిసీ రాముడు పట్టాభిషేకానికి సిద్దపడ్డాడంటే అది రాముడి కపటం అవదూ??

పితృ వాక్య పరిపాలన అనే నియమం రాముడు పాటించేవాడని రంగనాయకమ్మ చాలా  convenient గా మరిచిపోయింది. ఈ పితృవాక్య పరిపాలన గురించి మరింత విపులంగా ముందు ముందు చెప్పుకుందాం.

"భరతుడి  హక్కు సంగతి రాముడికి కూడా తెలుసు " అన్నట్టు కవి ఎందుకు రాశాడు?? రాముడికేమీ తెలియకే పట్టాభిషేకానికి అంగీకరించాడు  అన్నట్టు కథ నడపవచ్చు కదా?? కవి అలా ఎందుకు చేయలేదు?? - ఇలాంటి సందేహాలు చాలా వస్తాయి మనకి . కానీ ఈ కథలో కొన్ని సందేహాలకు జవాబులే దొరకవు.

రంగనాయకమ్మ తనకు వచ్చిన సందేహాలు అందరికీ వస్తాయాని/వచ్చాయని ఊహించి జెనరలైజ్  చెయ్యడం ఎంత వరకూ సబబో ఆమె విజ్ఞతకే వదిలేస్తున్నా.. కాకపోతే కొన్ని సందేహాలకు సమాధానాలు దొరకవు అనడం విడ్డూరం. ఆమెకు దొరకలేదంటే ఎవరికీ దొరకలేదని కాదు.ఇలాంటి జెనరలైజేషన్ వల్ల రచయిత మీద  గౌరవం తగ్గడం మినహా మరే ఉపయోగం లేదు. అసలు మనిషి జ్ఞాన సముర్పార్జన మొదలైంది సందేహాలతోనే ! తమ మేధస్సుకు అర్థం కాని సందేహాలకు సమాధానాలు దొరకాలంటే ఎవరైనా తమ కంటే పెద్దలను/అనుభవజ్ఞులను కలిసి కొంత మేధోమధనం చెయ్యాలి. రంగనాయకమ్మ లాంటి అపర మార్క్సిస్ట్ మేధావికి ఇంత చిన్న విషయం తెలియక పోవడం కడు విచారకరం.

మరొక విషయం:

రాముడికి రాజ్యం మీద హక్కే లేనప్పుడు ఇక రాముడికి జరిగిన అన్యాయం ఏముంది? రాముడికి రాజ్యం దక్కలేదని అందరూ శోకాలు పెట్టడం లో అర్థం ఏముంది?? దశరథుడు చివరికి రాజ్యాన్ని భరతుడికే ఇవ్వడానికే ఒప్పుకున్నాడంటే రాజ్యం భరతుడిదే అని తేలినట్టే కదా?? భరతుడి హక్కే నిజం అయితే రాముడి హక్కు అబద్దం అయిపోవలసిందే కదా?? "రామాయణం" కథే దాని గొప్పతనమే అబద్దం అయిపోతుంది కదా??

రాముడి కోసం అందరూ శోకాలు పెడితే మధ్య రంగనాయకమ్మ కు వచ్చిన ఇబ్బంది ఏమిటో ఎవరికైనా తెలిస్తే చెప్పగలరు.. దశరథుడు చివరికి రాజ్యాన్ని భరతుడికి ఇవ్వడానికి ఒప్పుకున్నాడని రాసింది, అంటే మొదట రాముడికి ఇవ్వాలని అనుకున్నమాట నిజమే కదా.. రాముడికి రాజ్యం మీద హక్కు లేకుంటే రామాయణం గొప్పతనం అబద్దం అయిపోతుందని రంగనాయకమ్మ చెప్పిన కంక్లూజన్ అపరిపక్వంగా ఏదో ఒకటి విమర్శించడానికి అన్న మాటలుగా ఉన్నాయి తప్ప ఏమాత్రం పసలేదు. రామాయణం అంటే ఒక్క అయోధ్య కాండ మత్రమే కాదు, అందులో ఇంకా చాలా కథ ఉంది. సరే! ఆ కథ గురించి రంగనాయకమ్మ 750 పేజీలు రాసింది వాటిలో ప్రతీ పేజి గురించి నేను కూడా రాస్తాను. Let the party begin!!  


రామదండు